ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డుల్లో వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్స్ కు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. గురువారం మంత్రి కారుమూరి నాగేశ్వరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన కానుకగా జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్స్ జీతం అదనంగా రూ.750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు.
గ్రామాల్లో, పట్టణాల్లో వాలంటీర్లకే కేటాయించిన 50 ఇళ్ల పరిధిలో రేషన్ను పకడ్బందీగా ఇవ్వాలనే ఉద్దేశంతో నెలకు రూ.5వేలు కాకుండా అదనంగా నెలకు రూ.750 పెంచుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వాలంటీర్లకు ఇంకా మంచి చేస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి దోచుకునేందుకు జగన్ పాలన పోవాలంటున్నారని మండిపడ్డారు. జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా తిరిగి జగన్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కారుమూరి నాగేశ్వరావు ధీమా వ్యక్తం చేశారు.
ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అందించామని.. విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాష్ట్రంలో లక్షలమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఏపీ జీడీపీలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని.. నాడు నేడు, ఆరోగ్య సురక్ష ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయన్నార.