ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వసతి కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. దక్షిణాదిలో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఈ నిర్ణయాన్ని ఏపీలో కూడా కార్యరూపంలోకి తీసుకురావడానికి జగన్ సర్కారు కసరత్తు చేస్తున్నది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులను ఇప్పటికే పురమాయించినట్లుగా.. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే.. ప్రభుత్వం మీద పడగల భారం గురించి అంచనాలు తయారుచేయాలని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే మహిళా సమాజానికి మేలుచేసే ఈ నిర్ణయానికి జగన్ సర్కారు రావడం పట్ల తెలుగుదేశం వర్గాలు అసహనానికి గురవుతున్నాయి. ఓర్వలేకపోతున్నాయి. తమ పార్టీ నాయకుడి ప్రకటన చూసి జగన్ ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ చేస్తున్నారంటూతప్పుడు ప్రచారానికి దిగుతున్నాయి.
మహిళలకు ఉచిత బస్సు రవాణాసదుపాయం కల్పించడం అనే మాట.. చంద్రబాబునాయుడు ఈ ఏడాది మేలో జరిగిన మహానాడులో వెల్లడించిన మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన మాట నిజం. ఇటీవల యువగళం ముగింపు సభలో కూడా ఆయన ఈ మాట అన్నారు. అంతమాత్రాన మహిళలకు ఉచితప్రయాణంపై తమకే పేటెంటు ఉంటుందని చంద్రబాబునాయుడు మరియు పచ్చమీడియా అనుకుంటే ఎలాగ? ఎందుకంటే.. అది ఆయన బుర్రలో పుట్టిన ఆలోచన ఎంత మాత్రమూ కాదు. పొరుగునే ఉన్న తమిళనాడులోనూ, కర్ణాటకలో కూడా చాలా సక్సెస్ ఫుల్ గా అమలు అవుతూనే ఉంది.
అక్కడి నుంచి కాపీ కొట్టి మాత్రమే చంద్రబాబునాయుడు మహానాడు మినీ మేనిఫెస్టోలో ఆ మాట చేర్చారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకోవడం వింతేమీ కాదు. జగన్ ప్రభుత్వం ప్రారంభించిన అనేకానేక పథకాలను ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా వచ్చి అధ్యయనం చేసి వెళ్లి.. తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.
అలాంటి నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఏర్పాటును తమ రాష్ట్ర మహిళలకు కూడా అందించాలని జగన్ అనుకున్నారు. అయితే తెదేపా ఇచ్చిన హామీని ముందే అమలు చేయడానికి జగన్ తహతహ లాడుతున్నట్టుగా పచ్చమీడియా కారుకూతలు కూస్తోంది. జగన్ కాపీ కొట్టినట్టుగా చెబుతోంది. కాపీ నిజమే కావొచ్చు గానీ.. చంద్రబాబును చూసి కాపీ కొట్టారని అనుకుంటే ఎలా? అది ఇతర రాష్ట్రాల్లోని పథకం కదా అనేది ప్రజల సందేహం.
ఇలా భుజాలు తడుముకుని కాపీ కొట్టి ముందే అమలు చేయడం చంద్రబాబు అలవాటు. జగన్ తన పాదయాత్రలో వృద్ధాప్య పెన్షన్లను రెండువేలు చేస్తానంటే.. ఎన్నికలు సమీపించాక చంద్రబాబు భయపడి పెన్షను రెండు వేలు చేసేశారు. అయితే జగన్ తాను అధికారంలోకి వచ్చాక మూడు వేలు చేస్తానని ప్రకటించి కార్యరూపంలో పెట్టారు. అలా ప్రత్యర్థి హామీలకు భయపడే తన అలవాటునే చంద్రబాబు జగన్ కు పులమాలని అనుకుంటున్నారు.