సీఎం జగన్ ను కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. “మీరు చెప్పినట్టు మేం వినం. మీకు చేతనైంది చేసుకోండి. మా దారి మేం చూసుకుంటాం” అనే ధిక్కార స్వభావంతో ఆ ఇద్దరు నేతలు మెలుగుతున్నారనే చర్చ వైసీపీలో పెద్ద ఎత్తున జరుగుతోంది.
వైసీపీలో మిగిలిన కులాల నేతలు కనీసం అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తామని చెబుతున్నారు. ఆ ఇద్దరు కమ్మ నేతలు మాత్రం అలాంటి మర్యాదను పాటించడానికి కూడా సిద్ధంగా లేరు.
వైసీపీలో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యవహార శైలిపై చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల అంతర్గత చర్చల్లో వాళ్లిద్దరే కరెక్ట్ అని మాట్లాడుకుంటున్నారని తెలిసింది. నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పద్దతిగా తన నియోజకవర్గ పరిధిలో పనులు చేసుకుంటూ వచ్చారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుని తన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మంజూరు చేయించుకున్నారు.
మరికొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనేది ఆయన లక్ష్యం. వివాదాలకు దూరంగా వుంటున్నారు. ఇప్పుడాయన్ను సామాజిక సమీకరణల పేరుతో గుంటూరు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించడం, అందుకు కృష్ణదేవరాయులు ససేమిరా అనడం తెలిసిందే!
నరసారావుపేట టికెట్ ఇస్తావా? ఇవ్వవా? ఏదో ఒకటి తేలిస్తే, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని కృష్ణదేవరాయులు బహిరంగంగానే చెబుతున్నారు. సీఎం జగన్ ఆప్షన్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. ఇక బంతి జగన్ కోర్టులోనే వుంది.
కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఎక్కడా తగ్గేది లేదని అంటున్నారు. వైసీపీ అధిష్టానం వైఖరికి విసిగిపోయి అలకబూని హైదరాబాద్లో కూచున్నారు. సీఎంవో నుంచి రెండు మూడు దఫాలు ఫోన్ కాల్స్ వెళ్లినా, సీఎంను కలవడానికి ఆసక్తి చూపలేదు. చివరికి బుజ్జగించి ఆయన్ను సీఎంతో భేటీ చేయించారు.
మీరు బతిమలాడుతుంటే, తాను పోటీ చేస్తున్నా అన్నట్టుగా వుంది వసంత కృష్ణప్రసాద్ వైఖరి. నిన్న తిరువూరు సభలో వసంత కృష్ణప్రసాద్ ను మినహాయించి వైసీపీ ప్రజాప్రతినిధులపై చంద్రబాబు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఏమో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదనే చర్చ జరుగుతోంది.
వైసీపీలో వినుకొండ, పెదకూరపాడు, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో కమ్మ నేతల స్థానాలు పదిలం. దీంతో వారెవరూ జగన్ పై ధిక్కార స్వరం వినిపించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో త్వరలో త్వరలో ఉంది.