కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోడలు వైయస్సార్సీపి నుంచి పోటీ చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి.. కొందరికి టికెట్లు దక్కడం లేదు.. మరికొందరికి సీట్లు మారిపోతున్నాయి..
ఇక వైసీపీ రెండో జాబితా విడుదలైన తర్వాత.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబం పేరు తెరపైకి వచ్చింది.. ముద్రగడ చిన్న కోడలు సిరిని తుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపే యోచనలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ముద్రగడ చిన్న కొడుకు గిరిబాబు భార్యనే ఈ సిరి… ఆమె సొంత ఊరు తుని నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం కావడంతో.. సిరిని అదే నియోజకవర్గం నుంచి పోటీకి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
అయితే, తుని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతరి దాడిశెట్టి రాజాను.. కాకినాడ ఎంపీగా పోటీ చేయించే యోచనలో ఉంది వైసీపీ.. ఈ అభిప్రాయాన్ని ఆయన ముందు పెట్టడంతో.. ఎంపీగా వెళ్లడానికి దాడిశెట్టి ఆసక్తి చూపనట్టు తెలుస్తోంది. కానీ, ఫైనల్ గా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించారు. తుని నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దాడిశెట్టి రాజా. మార్పులు చేర్పుల్లో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉండగా.. ఇక ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెడితే బాగుంటుంది అని ఆలోచన చేస్తోంది వైసీపీ అధిష్టానం.. దాడిశెట్టి రాజా.. లోక్ సభ బరిలో దిగుతారా? లేదా అనే విషయాన్ని పక్కనబెడితే..
ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉంటున్న ముద్రగడ పద్మనాభం కుటుంబానికి ఓ సీటు ఇవ్వాలని.. అందులో భాగంగానే ముద్రగడ చిన్న కోడలు సిరిని తుని అసెంబ్లీ నుంచి బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ముద్రగడ పద్మనాభం కుటుంబానికి అక్కడి కాపులు,ఇతర సామాజిక వర్గ ప్రజలు సపోర్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.