నేచురల్ స్టార్ నాని ఈ యేడాది ‘దసరా’ సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన హాయ్ నాన్న అంటూ పలకరించారు.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ మొదటి రోజు కాస్త తడబడ్డా.. ఆ తర్వాత స్థిరమైన కలెక్షన్స్‌తో నిలబడింది. సలార్ హవాలోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాదు బ్రేక్ ఈవెన్ సాధించి బంపర్ హిట్ అయ్యింది.
ఇక దాదాపుగా ఇప్పటికే అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రేపు మిడ్ నైట్ నుంచి అంటే జనవరి 3 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. హాయ్ నాన్న ఓటీటీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది.
జెర్సీ తర్వాత మరోసారి ఏమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్ట్‌తో నాని చేసారు. జెర్సీలో తండ్రీ తనయులు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కితే.. తాజాగా ‘హాయ్ నాన్న’ మాత్రం తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో తెరకెక్కింది. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో నాని కెమిస్ట్రీ కూడా బాగా వర్క్అవుట్ అయింది.
ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 28.50 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 8కోట్లకు పైగా లాభాలను అందుకుంది.
హాయ్ నాన్న నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ సినిమాకు చెందిన శాటీలైట్ రైట్స్‌ను జెమినీ టీవీ భారీ ధరకు దక్కించుకుంది. హాయ్ నాన్న రైట్స్‌ను జెమినీ టీవీ ఏడు కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. ఇక నాని నటించిన సినిమాల శాటిలైట్ రైట్స్ అన్నింటినీ వరుసగా సన్ నెట్ వర్క్ దక్కించుకుంటోంది.
ఇంతకుముందు నాని హీరోగా నటించిన 3 సినిమాలు జెమినీ దగ్గరే ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా.. ఈ మూడు సినిమాల రైట్స్ దక్కించుకున్న ఈ సన్ నెట్ వర్క్ ఇపుడు హాయ్ నాన్న శాటిలైట్ రైట్స్ కూడా కొనుగోలు చేసింది. మొత్తంగా ఈ సినిమా నానికి మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది.