ఇటీవల వైసీపీలో విచిత్రమైన రాజీనామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఏ పార్టీలోనైనా అవకాశం ఏ విధంగానూ లేకపోతే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్తారు. కానీ వైసీపీలో అవకాశాలు ఇచ్చినా వాటిని పొంది కూడా మళ్లీ అలకలతో రాజీనామాలు చేయడం చిత్రంగా ఉందని ఆ పార్టీలో నేతలు అంటున్నారు.
అందరికీ ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. ఒకరికే ఒక పదవి అన్న నియమం ఎపుడూ ఉంటుంది… ఆ విధంగా కొందరికి ఎమ్మెల్సీ చాన్స్ ఇచ్చారు,మరికొందరికేమో వేరే పదవులు, హామీలు ఇచ్చారు. అయినా సరే తమకు అన్యాయం జరిగిందని రాజీనామాలు చేయడం పట్ల చర్చ తీవ్ర స్థాయిలోనే సాగుతోంది.
ఎక్కడ లోపం ఉంది ఎవరిది తప్పు అన్నది కూడా తర్కించుకునే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించినా వంశీ క్రిష్ణ పార్టీని వదలిపోవడం బాధాకరం అని విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు.
మరో నేత కూడా తాజాగా రాజీనామా చేశారు. ఆయనకు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవిని పార్టీ ఇచ్చింది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చింది. అయినా ఆయన ఓడిపోయారు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడం పట్ల భిన్నగా స్పందన వస్తోంది.
ఇదే కోవలో ఇంకా ఎవరైనా రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిజంగా ఎవరికీ ఏ పదవీ ఇవ్వకుండా ఉంటే వారు బయటకు వెళ్లినా.. కొంత అర్ధం ఉంటుందని పదవులు ఇచ్చినా ఇలా రాజీనామాలు చేయడాన్ని ఎలా చూడాలని పార్టీలో డిస్కషన్ సాగుతోంది.
ఒక విధంగా హై కమాండ్ మెతక ధోరణి ఏమైనా ఉందా?అన్న చర్చ కూడా సాగుతోంది. నేతలందరికీ పదవులు ఇవ్వడం ఒకటైతే వారికి ముందే చెప్పి మీకు ఈ అవకాశం ఇచ్చాం ఇక వేరే ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పలేకపోవడం వల్లనే ఈ రకంగా పరిస్థితి మారిందా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
ఆశలు అందరికీ ఉంటాయి కానీ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ హై కమాండ్ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు కొన్ని సమస్యలు వస్తాయి. అయితే అలిగి బయటకు వెళ్లిపోయిన వారి విషయంలో ఒక ఆలోచన ఉంటే ఇదే తీరున ఇచ్చిన పదవులు చాలవని భావించే వారు పెరిగితే ఎలా అన్నదే అందరూ అనుకుంటున్న విషయం.