జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. ‘చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి.. ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు.. “అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి” అని పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు ప్రకటించారన్నారు. “కనుక అందరి మాట ఇదే” అంటూ లోకేష్‌బాబు ప్రకటించేశారన్నారు. ‘లోకేష్ బాబు ఆశిన్తున్నట్లుగా చంద్రబాబునే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా?’ అని ప్రశ్నించారు.
‘మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటున్న జన సైనికులు కలలు ఏం కావాలనుకుంటున్నారు?’ అంటూ హరిరామజోగయ్య లేఖలో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారన్నారు. 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మొక్షమెప్పుడు? అన్నారు.
‘మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకొక దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి?’ అని ప్రశ్న సంధించారు. ‘ఈ ప్రశ్షలన్నిటికి మీ నుంచి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులందరికి అర్ధమయ్యేలా చెప్పాల్సిందిగా కోరుచున్నాము’ అంటూ లేఖ రాశారు.
నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో.. టీడీపీ-జనసేన పార్టీల పొత్తులో ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నిస్తే.. చంద్రబాబే సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల్ని హరిరామజోగయ్య లేఖలో ప్రస్తావించారు.