కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే విషయాల్లో అపరిమితమైన ప్రచారాలను చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది. అదే తమ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే కొన్ని విషయాలపై సమంజసం కాని మౌనం పాటిస్తుంటుంది. ప్రజల నుంచి, సంబంధిత బాధితులనుంచి ఎన్ని వేడుకోళ్లు వచ్చినా స్పందించదు. ఎలాంటి దుష్పరిణామాలకు తమ మౌనం కారణం అవుతున్నప్పటికీ స్పందించదు.
భారత్ రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారం కూడా అలాంటివాటిలో ఒకటిగా కనిపిస్తోంది. రెజ్లర్ల గోడును పట్టించుకోకుండా మోడీసర్కారు వ్యవహరిస్తున్న బధిరత్వపు తీరుకు ఇది నిదర్శనమా అనే అభిప్రాయం దేశ ప్రజలకు కలుగుతోంది.
భారత రెజ్లింగ్ సమాఖ్యలో భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్.. మహిళా రెజ్లర్లను లైంగింకంగా వేధిస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంనుంచి వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహిళా రెజ్లర్లు, వారికి మద్దతుగా పురుషరెజ్లర్లు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. ఉద్యమాలు పోరాటాలు చేశారు. పోలీసులు వారిపట్ల అమానుషంగా వ్యవహరించిన సందర్భాలు కూడా మనం చేశాం. పార్లమెంటును ముట్టడించడానికి, తమ గోడు చెప్పడానికి ప్రయత్నిస్తే ఏ స్థాయిలో అడ్డుకున్నారో, ఎంత ఘోరంగా అణచివేశారో చూశాం.
అలాగే తమ పతకాలను గంగలో కలిపేయడానికి రెజ్లర్లు అందరూ ఉద్యమంగా కదిలితే పరువు పోతుందనే భయంతో వారిని బెదిరించి బుజ్జగించి ఆపారు. అయితే తమ ఎంపీ బ్రిజ్ భూషణ్ మీద మాత్రం ఎలాంటి చర్య తీసుకోలేదు. భారతీయ రెజ్లర్లు కొన్ని అంతర్జాతీయ టోర్నీల్లో.. భారత్ తరఫున కాకుండా.. ప్రైవేటుగా పాల్గొని పతకాలు సాధించిన అవమానకరమైన సంఘటనలు కూడా కొన్ని జరిగాయి.
ఇంతా జరిగినా.. భారత్ రెజ్లింగ్ సమాఖ్యకు తాజాగా జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అనుయాయి, నమ్మకస్తుడు అయిన సంజయ్ సింగ్ గెలిచారు. దీనిపై రెజ్లర్లు మళ్లీ మండిపడుతున్నారు. దీనికి నిరసనగా సాక్షి మలిక్ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించేసింది. తాజాగా దిగ్గజ రెజ్లర్ బజరంగ్ పునియా.. తనకు కేంద్రం అందించిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కు తిరిగి ఇచ్చేయబోతున్నట్టుగా ప్రకటించారు.
ఇది మోడీ సర్కారుకు చాలా అవమాన కరమైన నిర్ణయం. కానీ.. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవడానికి వారు అసలు ఎందుకు స్పందించడంలేదో ప్రజలకు అర్థం కావడం లేదు. కనీసం తమ సొంత పార్టీ ఎంపీ సచ్చీలుడు అని చెప్పుకోడానికైనా సరే.. ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తే సరిపోతుంది. ఆ పని కూడా జరగడం లేదు. వారి ఆరోపణలపై ప్రభుత్వం ఇంతటి బధిరత్వంతో ఎందుకు వ్యవహరిస్తోందో.. ఎందుకు పట్టించుకోవడంలేదో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.