ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నిర్మొహమాటి అనే పేరుంది. ఎవరేమనుకుంటారో ఆయనకు అనవసరం. తాను చెప్పదలుచుకున్నది ముఖం మీదే చెప్పేస్తారు. ఏదైనా చేయాలని అనుకుంటే, ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ ముందుకే వెళ్తారు. తమ నాయకుడు నారా లోకేశ్ కూడా జగన్ మాదిరే అని ఆయన అనుచరులు చెబుతున్నారు.
జగన్ ను ఎదుర్కోవాలంటే తన తండ్రి మాదిరిగా సంప్రదాయ రాజకీయాలు చేస్తుంటే, కుదరదని లోకేశ్ అభిప్రాయం. జగన్ మాదిరిగానే టెర్రరైజ్ చేయాలనే సంకల్పంతో లోకేశ్ ముందుకెళ్తున్నారు… లోకేష్ ఆ ఆలోచనలనుంచి పుట్టుకొచ్చిందే రెడ్ బుక్. పాదయాత్రలో ఆయన రెడ్ బుక్ రాయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ బుక్ లో తన పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించిన అధికారులు, వైసీపీ నేతల పేర్లు రాసుకున్నారు.
పాదయాత్ర విజయోత్సవ సభలో రెడ్ బుక్ ను తన తండ్రి చంద్రబాబునాయుడికి అందించి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతు చూడాలని సభాముఖంగా కోరడం గమనార్హం. పీకేని సలహాదారుడిగా నియమించుకోవడం వెనుక లోకేశ్ అంతరంగాన్ని అర్ధం చేసుకోవచ్చు. గతంలో జగన్ కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగిలిన సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తేవడంలో పీకే సలహాలు పనికొచ్చాయని లోకేశ్ నమ్ముతున్నారు. అందుకే ఈ దఫా తాను కూడా అదే విధంగా చేసేందుకు పీకేని లోకేశ్ ఎంచుకున్నారు.
ఇదే సందర్భంలో జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలోనూ లోకేశ్ ఏ మాత్రం మొహమాటానికి పోలేదు. సీఎం పదవి విషయమై తాను, చంద్రబాబు కూర్చొని మాట్లాడుకుంటామని పవన్ చెప్పిన మాటలు లోకేశ్ కు రుచించలేదు. దీంతో తన ఆవేదనను మనసులోనే పెట్టుకుని లోకేశ్ కుమిలిపోలేదు.
సీఎం పదవి విషయమై జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు… ఏ మాత్రం తడుముకోకుండా చంద్రబాబే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా వుంటారని తేల్చి చెప్పారు. దీంతో జనసేన నాయకులు లబోదిబోమన్నారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్పందిస్తూ లోకేశ్ సీఎం పదవిపై చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటని పవన్ ను ప్రశ్నించారు.
ఒకవైపు సీఎం పదవిపై లోకేశ్ అన్న మాటలపై చర్చ జరుగుతుండగానే, డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ నిర్మొహమాటంగా తన మనసులో మాటను బయట పెట్టారు పవన్ కు డిప్యూటీ సీఎం పదవిపై చంద్రబాబు, పొలిట్ బ్యూరో సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో పవన్ స్థాయి ఏంటో లోకేశ్ చెప్పకనే చెప్పారు.
టీడీపీ బలహీనంగా వుందని, అందుకే మద్దతు ఇచ్చానని పనన్ గొప్పలు చెప్పిన తరుణంలో, జనసేనను లోకేశ్ చావు దెబ్బ తీశారు. లోకేష్ మార్క్ రాజకీయాన్ని ఇటీవల ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ప్రతిభమించాయి. ఇలా ఉంటేనే ప్రస్తుత రాజకీయాల్లో నెట్టుకు రాగలమనే అభిప్రాయంలో లోకేష్ ఉన్నారు. అయితే లోకేష్ తీరు టీడీపీ సీనియర్ నేతలకు నచ్చడం లేదు.