జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరపతి ఇటీవల కాలంలో బాగా పడిపోయింది. దీనికి ప్రధాన కారకుడు టీడీపీ వారసుడు నారా లోకేశ్. పవన్ అన్నా అంటూనే, ఆయనకు వెన్నుపోటు పొడిచాడని జనసేన శ్రేణులు అనుమానిస్తున్నాయి. యువగళం పాదయాత్ర ముగిసిన తర్వాత లోకేశ్ పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబే సీఎం అని చెప్పడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే పుండుమీద కారం చల్లినట్టు లోకేశ్ మాట్లాడారనే చర్చ జరుగుతున్న సందర్భంలో, టీడీపీ వారసుడు మరింత దూకుడు ప్రదర్శించారు. పవన్ కు డిప్యూటీ సీఎం ఇస్తామని కూడా ఆయన చెప్పలేదు. అదంతా పలు దఫాలు చర్చలు జరిగిన తర్వాతే తేలుతుందని చావు కబురు చల్లగా చెప్పారు.
దీంతో పవన్ పై కాపు నాయకులు, విదేశాల్లో వుంటూ జనసేనకు ఆర్థికంగా అండగా నిలిచే శ్రేయోభిలాషులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. మీరు సీఎం, డిప్యూటీ సీఎం కాకపోతే, చంద్రబాబు, జగన్ లలో ఎవరేమైతే మనకేంటి అని పవన్ను ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఇలాగైతే అసలుకే ఎసరు వస్తుందని, పొత్తుపై పునరాలోచన చేయాలని సూచించినట్టు తెలిసింది.
జనసేన కార్యాలయంలో పవన్ మూడు రోజులుగా తిష్ట వేసి చర్చోపచర్చలు జరుపుతున్నారు. సహృదయంతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, అటు వైపు నుంచి మాత్రం అవమానకర రీతిలో ప్రవర్తిస్తున్నారని పవన్ కూడా మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీతోనే పొత్తులో వుంటే తమ దారి తాము చూసుకుంటామని మెజార్టీ కాపులు పవన్ అంటున్నట్టు తెలిసింది. దీంతో పవన్ మనసులో పునరాలోచన మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబుతో తెగదెంపులు చేసుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదనే టాక్ నడుస్తోంది. ఒకవైపు లోకేశ్ యథేచ్చగా పవన్ను అవమానిస్తుంటే, చంద్రబాబు మాత్రం మౌనంగా వుంటున్నారని పవన్ తన సన్నిహితులతో చెప్పారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.