జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లో అమాయకత్వం, అజ్ఞానం సమపాళ్లలో ఉంటాయి. తానోక మహా మేధావినని అనుకోవడం పవన్ అజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. లక్షలాది పుస్తకాలు చదివి, వాటిలోని సారాంశాన్ని మనసుకు ఎక్కించుకు. మేధావినని ఆయన అనుకుంటుంటారు.
అప్పుడప్పుడు ఆయన నిజాలు మాట్లాడుతుంటారు. లోకేశ్ యువగళం విజయోత్సవ సభలో పవన్ సహజంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అవాకులు చెవాకులు పేలారు. అయితే ఇదే సందర్భంలో టీడీపీకి ఏ మాత్రం గిట్టని కామెంట్స్ కూడా చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో జగన్ అరెస్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే… “అప్పట్లో సోనియా” జగన్ ను జైల్లో పెట్టించారు. కాంగ్రెస్ నాయకులు తప్పులు చేస్తే ఆ కక్షతో జగన్, చంద్రబాబును జైల్లో పెట్టించడం ఏమిటి?”
తండ్రి వైఎస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకుని జగన్ జైలుకెళ్లి, 16 నెలలు గడిపారని పలు సందర్భాల్లో పవన్ విమర్శించారు. కానీ తాజా సభలో మాత్రం జగన్ను సోనియాగాంధీ జైలుకు పంపారని చెప్పడం గమనార్హం. జగన్ను జైలుకు పంపి కాంగ్రెస్ తప్పు చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పుతో జైలుకెళ్లిన జగన్, ఆ కక్షతో చంద్రబాబును జైలుకు పంపడం ఏంటని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.
జగన్ కేసులో టీడీపీ నేతలు కూడా ఇంప్లీడ్ అయిన సంగతి పవన్ కు తెలియనట్టుంది. కాంగ్రెస్, చంద్రబాబు జత కట్టే జగన్ ను రాజకీయంగా మొగ్గ దశలోనే తుంచేసేందుకు కుట్రలకు తెరలేపారనేది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్, టీడీపీ కేసుల పేరుతో జగన్ ను జైలుపాలు చేసినా జగన్ ఏనాడూ బెదరలేదు.
టీడీపీ తన అనుకూల మీడియాను అడ్డు పెట్టుకుని జగన్ ను అవినీతిపరుడిగా ముద్ర వేసి, రాజకీయంగా సమాధి చేయాలని విశ్వ ప్రయత్నం చేసింది. ఆ కుట్రలన్నింటిని ఛేదించుకుంటూ.. ప్రజాదరణ పొంది, నేడు ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగుతున్నారు. ఏది ఏమైనా జగన్ ను జైలుకు పంపి కాంగ్రెస్ తప్పు చేసిందనే మాట మాత్రం టీడీపీ జీర్ణించుకోలేదు.