ఇటీవల కాంగ్రెస్.. ప్రతిపక్షం చాలా బలంగా ఉండాలి అని అభిలషించారు. ప్రతిపక్షం నుంచి తమ పాలనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని దిద్దుకుని ప్రజోపయోగకరమైన పాలన సాగించేలా మంచి సలహాలు సూచనలు కావాలని.. ఆదర్శాలను వల్లించారు.
అలాగే బీఆర్ఎస్ కూడా ప్రజల తీర్పును గౌరవిస్తామని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి మూడునెలల వరకు, వంద రోజుల వరకు సమయం ఇస్తాం అన్నారు. వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని, ఆ తర్వాత కూడా మాట నిలబెట్టుకోలేకపోతే ప్రజా పోరాటాలకు దిగుతామని చెప్పారు.
కానీ, ఉభయులలో ఏ ఒక్కరికి కూడా అంత సహనం లేదు. తెలంగాణలో పాలక- ప్రతిపక్షాల మధ్య అప్పుడే బీభత్సమైన రచ్చ మొదలైపోయింది. ఆ రచ్చ కూడా ‘అప్పు’ల మీదనే మొదలైంది.
ఏ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినా సరే.. శ్వేతపత్రం అనే మాట చెప్పడం, పాత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచి వెళ్లిపోయిందనే మాట చెప్పడం సహజమైన పరిణామం. అయితే.. తాము ప్రకటించిన ప్రజాకర్షక, ధనవ్యయంతో కూడుకున్న పథకాలను కార్యరూపంలోకి తేవడంలో కొంత సమయం తీసుకోవడానికి.. ఆర్థికంగా రాష్ట్రం దుస్థితిలో ఉన్నదనే నెపంపెట్టేసి కొన్ని రోజులు గడుపుతారు. ఇందుకు ఎవ్వరూ అతీతులు కాదు. రేవంత్ రెడ్డి కూడా అదే పని చేశారు. పదేళ్ల భారాస పాలనపై శ్వేతపత్రం తెచ్చారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లో ముంచేశారని ప్రకటించారు.
మామూలుగా అయితే.. తెలంగాణ మంచి రాబడి ఉన్న ధనిక రాష్ట్రం అనే చెప్పాలి. అయితే, రాష్ట్రానికి ఏటా వచ్చే రాబడిలో 34 శాతం అప్పులకే వెచ్చించాల్సి వస్తోందనే వాస్తవాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టారు. అప్పు తీర్చడానికి మళ్లీ అప్పులు చేస్తూ.. రుణాలను రాష్ట్ప్రజల మీద గుదిబండగా మార్చేశారని.. శ్వేతపత్రాన్ని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
సహజంగానే పాలకపక్షం విమర్శలకు భారాస కౌంటర్లు ఇచ్చింది. శ్వేతపత్రంలోని లెక్కలన్నీ తప్పులేనని హరీష్ రావు తేల్చేయగా, కేటీఆర్ మాత్రం.. తమ ప్రభుత్వం ఆస్తులను పెంచిందని డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు. ఆస్తులను పెంచడం అనేదానికి ఇదమిత్థమైన రూపం లేదు. వడ్డీలకు అప్పులు తెచ్చి ఆస్తులు తయారు చేయాల్సిన అవసరమేంటి? అనేది ఒక ప్రశ్న.
అయితే.. ఈ పదేళ్లలో రాష్ట్రానికి కొత్త ఆస్తులను వాళ్లేమైనా తయారుచేశారా? లేదా. ఆస్తుల విలువను కృతకంగా పెంచేసి.. తాము ఆస్తులు పెంచినట్టుగా బిల్డప్ ఇచ్చే మాయ చేస్తున్నారా? అనేది అర్థం కావడం లేదు. మొత్తానికి అప్పుల రణరంగంలో అప్పుడే యుద్ధం మొదలైపోయింది