అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? ఇది పైకి కనిపించేది కాదు. పైకి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎన్టీఆర్ తో తన బంధం ఎప్పుడూ అలానే ఉంటుందంటున్నారు కల్యాణ్ రామ్.
వృత్తిపరంగానైనా, వ్యక్తిగతంగానైనా తారక్ తో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటానని… అలా తమ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందని చెబుతున్నారు.
“ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నాది మాత్రమే కాదు, తమ్ముడు ఎన్టీఆర్ ది కూడా. ఆ బ్యానర్ పై తను సినిమా చేస్తున్నప్పుడు నేను పర్యవేక్షకుడిగా మాత్రమే ఉంటాను. కేవలం సపోర్ట్ గా ఉంటాను. నా అభిప్రాయం అడిగితే చెబుతాను. అక్కడివరకు మాత్రమే నా పరిథి. మేం ఎవరి గీత వాళ్లు గీసుకున్నాం. తమ్ముడు ఏం చేస్తాడో నాకు తెలుసు. ఎంతవరకు చొరవ చూపాలో అంతవరకు మాత్రమే నేను ఉంటాను. ఊరికే వేలు పెట్టి కెలకడం నాకు ఇష్టం ఉండదు. అలా ఎవరి జీవితాల్లో వాళ్లు ప్రశాంతంగా ఉంటాం. తమ్ముడి రేంజ్ అందరికీ తెలుసు. ఆయనేం చిన్న పిల్లాడు కాదు. కదా. మధ్యలో నేను వెళ్లి పుల్లలు పెట్టను.”
సినిమాల వరకు మాత్రమే కాదని, నిజజీవితంలో కూడా తమ బంధం అలానే కొనసాగుతోందని చెప్పారు కల్యాణ్ రామ్. తామిద్దరం ఎంతవరకు ఉంటామో అంతవరకే ఉంటామని… అదే తమ జీవన విధానం అని, అప్పుడే హ్యాపీగా ఉంటామని కూడా చెబుతున్నారు. తన సినిమాలపై తారక్ ట్వీట్స్ వేయాల్సిన అవసరం లేదంటున్నారు.
“సినిమా అంతా చూసి ఆయనకు నచ్చితే ట్వీట్ వేస్తారు. నేను అడగను. డెవిల్ ట్రయిలర్ చూశాడు మార్పులు చెప్పాడు చేశాం. ట్వీట్ వేయాలా వద్దా అనేది ఆయన ఇష్టం. ప్రతిదీ షేర్ చేయాలనేది మా పద్ధతి కాదు. మేమిద్దరం చాలా క్లియర్ గా ఉంటాం. ఓ ట్వీట్ వేయడం లేదా ఓ ఈవెంట్ కు రావడమే తమ మధ్య బంధానికి కొలమానం అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. మేమిద్దరం జీవితాంతం అన్నదమ్ములం. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆ బంధాన్ని ట్వీట్స్ ద్వారా కొలుస్తామంటే నాకు నవ్వొస్తోంది.”
ఇలా ఎన్టీఆర్ తో తన బంధాన్ని బయటపెట్టారు కల్యాణ్ రామ్. ఏ విషయంపైనా ఓపెన్ గా మాట్లాడే ఈ నటుడు, తమ్ముడు తారక్ తో తను మసులుకునే విధానాన్ని కూడా అంతే ఓపెన్ గా బయటపెట్టారు.