ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో కసరత్తు సాగుతోంది. అయితే విశాఖ జిల్లాలో కీలకమైన భీమునిపట్నం అసెంబ్లీ సీటుకు ఓ మహిలాళా అభ్యర్థి ఖరారు అయ్యారు. అంత మాత్రమే కాదు ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్ గా మారారు.ఇది రాజకీయ పార్టీల నుంచి కాదు, ఇండిపెండెంట్ పోటీ చేసేందుకు ఆమె ఆసక్తిని ప్రదర్శిస్తూ ముందుకు వచ్చారు.
భీమిలీ పరిధిలోని బలమైన సామాజిక వర్గం నుంచి నాగోతి నాగమణి అనే మహిళ తాను ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన నాగమణి తాను 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు.
నియోజకవర్గంలో ప్రభావితం చేసే సామాజిక వర్గం నుంచి నాగమణి పోటీకి దిగుతున్నారు. ఆ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే కావాలని చాలా ఆశలు ఉన్నాయి. కానీ ప్రతీ సారి రాజకీయ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇస్తున్నాయి. దాంతో ఈసారి బీసీల నుంచి ఆమె పోటీలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
మునిసిపల్ చైర్మన్ల దాకా వచ్చిన ఆ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే కావాలన్నది దశాబ్దాల కల. దాంతో వారే వెనక ఉండి నాగమణికి ఇండిపెండెంట్ గా పోటీ చేయిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈసారి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వబోతున్నాయి. మధ్యలో బీసీ మహిళ పోటీ ఏ రకమైన సమీకరణలకు తెర తీస్తుందో ఆసక్తిని పెంచే అంశంగా ఉంది.
ఏపీలో పోటీకి సిద్ధమని ప్రకటించిన సీట్లలో భీమిలీయే మొదటిది అని అంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా నిలబడతారా అన్న డిస్కషన్ సాగుతోంది.