వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ సుపరిపాలనను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లడానికి తీసుకువచ్చినదే వాలంటీరు వ్యవస్థ! గ్రామాల్లో ఖాళీగా ఉంటున్న, వేరే ఉపాధులు, ఉద్యోగాలకు వెళ్లే అవసరం, అవకాశం కూడా ఉండని వారి కోసం ఒక పార్ట్ టైం జాబ్ లాగా దీనిని తీసుకువచ్చారు వైఎస్ఆర్ సర్కార్.
ఈ వాలంటీరు వ్యవస్థ ద్వారా.. ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలనైతే ఆశిస్తున్నదో అవన్నీ చక్కగానే నెరవేరుతున్నాయి. వృద్ధులకు పెన్షన్లు ప్రతినెలా ఒకటో తేదీనాటికి వారి ఇంటివద్దకే అందుతున్నాయంటే.. ఎలాంటి ఇక్కట్లు లేకుండా పేదలు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని తీసుకోగలుగుతున్నారంటే.. అందుకు వాలంటీర్ల వ్యవస్థ అందిస్తున్న సేవలే కారణం.
నిజానికి వాలంటీర్ల సేవలను చాలా పరిమితంగా మాత్రమే ప్రభుత్వం వాడుకుంటోంది. వారిని స్వచ్చంద సేవకులుగా గుర్తించింది. వారికి గౌరవవేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వం పరంగా వారికి ఎన్ని రకాల పనులు చెబుతున్నప్పటికీ.. అన్నీ కలిపి రోజుకు రెండు మూడు గంటల కంటె ఎక్కువ పని ఉండే అవకాశమే లేదు. ఇలాంటి నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు అనేది మరింత పారదర్శకంగా తయారు కావడానికి, ఆ రకంగా పేదలకు మేలు జరగడానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతున్నదని అనుకుంటూ ఉండగా.. ఇప్పుడు వారు సమ్మెకు పూనుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం.
తమను పర్మినెంటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు రూ.18వేల వేతనం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాలంటీరు వ్యవస్థ రూపకల్పనలోని మౌలికమైన స్ఫూర్తికే ఇది విరుద్ధం. పర్మినెంటు ఉద్యోగుల్ని నియమించుకోవడానికి ప్రభుత్వం ఈ ఏర్పాటు చేయలేదు.
చదువుకుని ఉద్యోగాల్లో చేరడానికి ముందు ఏడాది రెండేళ్లు విరామం తీసుకుంటున్న వారు, తమ కుటుంబ పరిస్థితులు కారణంగా ఉద్యోగానికి వెళ్లే అవకాశమే లేకుండా, ఇష్టం లేకుండా ఇళ్లలోనే ఉండిపోయిన చదువుకున్న గృహిణులు ఇలాంటి బాధ్యతల్లో ఉండవచ్చు. అలాంటివారికి చిన్న అవకాశంగా మాత్రమే ఈ వ్యవస్థను రూపుదిద్దారు.
అయితే ఇప్పుడు వారు ఎదురుతిరగడంలో అత్యాశే కనిపిస్తోంది. పర్మినెంటు ఉద్యోగాల డిమాండుతో ప్రభుత్వాన్ని
డిఫెన్సులో పడేసే కుట్ర జరుగుతోంది.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంటే.. అందులో పాల్గొనకుండా వాలంటీర్లు సమ్మె చేయడం దుందుడుకు చర్యగా కనిపిస్తోంది. సమ్మెను కొనసాగిస్తూ జనవరి ఒకటిన పెన్షన్ల పంపిణీ కూడా చేయబోం అని అంటున్నారు. వాలంటీర్లు వ్యూహాత్మకంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికే ఇలాంటి పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సమస్యను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.