ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మొదటి దెబ్బ కొట్టారు. పీకే వ్యూహాలేంటో పూర్తిగా తెలిసిన జగన్, వైసీపీ నేతలు.. తాజా రాజకీయ పరిణామాల వెనుక అతనున్నాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని లోకేశ్ కు వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల స్పెషల్ గిఫ్ట్ పంపారు. అలాగే 2024 మంచి జరిగాలని ఆమె ఆశీస్సులు అందించడం గమనార్హం.
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. చావోరేవో అన్నట్టుగా అధికారం కోసం వైసీపీ, టీడీపీ తలపడుతున్నాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, టీడీపీకి జనసేనతో పాటు చిన్నాచితకా పార్టీల అండ వుంది. ఏది ఏమైనా ఈ దఫా ఎన్నికలు హోరాహోరీని తలపించనున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా, వ్యక్తిగతంగా బద్ద వ్యతిరేకి అయిన నారా కుటంబానికి వైఎస్ తనయ క్రిస్మస్, 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం వైసీపీ శ్రేణులకు తీవ్రమైన కోపం తెప్పిస్తోంది.
అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా నారా కుటుంబానికి షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం వెనుక పీకే వ్యూహం ఉన్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. పీకే ప్రతి వ్యూహం ఎలా వుంటుందో తమకు తెలుసని, నారా కుటుంబానికి షర్మిల విషెస్ వెనుక ముమ్మాటికీ అతని ఎత్తుగడ వుందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు.
షర్మిలతో పీకే వ్యూహాత్మకంగా గిఫ్ట్ పంపించడంతో పాటు శుభాకాంక్షలు చెప్పించారని వైసీపీ నేతలు అంటున్నారు. షర్మిలతో పీకేకి మంచి సంబంధాలున్నాయి. తెలంగాణలో షర్మిలకు రాజకీయంగా సలహాలు, సూచనలు ఇచ్చారు. అయినప్పటికీ అక్కడి పరిస్థితులకు షర్మిల ఎదుగుదలకు దోహదం చేయలేదు. అయితే జగన్తో షర్మిలకు విభేదాలను దృష్టిలో పెట్టుకుని పీకే ఆమెని రాజకీయ అస్త్రంగా వాడుకున్నారు.
తద్వారా తటస్థ ఓటర్లలో వైఎస్ జగన్పై వ్యతిరేకత పెంచే ప్రయత్నాన్ని పీకే చేశారని వారు అంటున్నారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులే చంద్రబాబు, లోకేశ్లలపై సానుకూలత ధోరణితో వున్నారని, ఇదే సందర్భంలో సీఎంపై వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలు పంపి, రాజకీయంగా దెబ్బ తీయడానికి పీకే కుట్రపన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలాంటివి రానున్న రోజుల్లో మరిన్ని చేసేందుకు పీకే వ్యూహాలు రచిస్తారని, ఇది మొదటి దెబ్బ అని, అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వారు చెబుతున్నారు.